శ్రీవారి భక్తులకు శుభవార్త- తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు  తిరిగి ప్రారంభించనున్న టీటీడీ

సామాన్య భక్తుల‌ కోసం టైం స్లాట్ సర్వదర్శన విధానాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలను ఏవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు నేటి అర్ధరాత్రి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు.  భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రంలో మొత్తం ముప్పై కౌంటర్లల్లో టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు‌ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు కల్పించామని చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి టోకెన్లు పొందిన భక్తులకు స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం ఉంటుందన్నారు. టిక్కెట్లు పొందిన భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ స్వామి వారి దర్శనం అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. 

శని, ఆది, సోమ, బుధ వారాల్లో 20 నుండి 25 వేల ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తారని వెల్లడించారు. మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో 15,000 టోకెన్ల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వదర్శనం టోకెన్లను రోజు వారీగా పెంచుతామన్నారు. సర్వదర్శనం టోకెన్లు దొరకని భక్తులు నేరుగా వైకుంఠం-2కు చేరుకుని స్వామి వారి దర్శనం పొందే సౌలభ్యం కల్పించామన్నారు.  టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయంలో స్వామి దర్శనం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు.